October 19, 2026

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో విమానయాన సంస్థలు సౌదీకి తమ సర్వీసులను ఈనెల 24 వరకు నిలిపివేశాయి. ఈ మేరకు ఆ సంస్థలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇండిగో, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు భారత్ నుంచి సౌదీకి తమ విమాన రాకపోకలను ఈనెల 24 వరకు రద్దుచేయగా.. ఎయిర్ ఇండియా ఈనెల 20 వరకు తన సర్వీసులను క్యాన్సిల్ చేసింది. అంతకుముందు ఈ సంస్థలు ఈనెల 17 వరకు తమ సర్వీసులను రద్దుచేసిన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మెరుగుపడకపోవడంతో విమాన సర్వీసుల రద్దును ఈనెల 24 వరకు పొడిగించాయి. ‘సౌదీ అరేబియాలో పరిస్థితిని ఎప్పటికపుడు పరిశీలిస్తున్నాం. ఉద్రిక్తతల నేపథ్యంలో రియాద్, జెద్దా, దమ్మం, మదీనాకు మా సర్వీసులను ఈనెల 24 వరకు రద్దు చేయాలని నిర్ణయించాం. ప్రభావిత కస్టమర్లకు ఈ మేరకు నోటిఫికేషన్లు పంపాం. వారికి ఎప్పటికపుడు సమాచారం అందిస్తున్నాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై నుంచి రియాద్‌కు ఇండిగో విమాన సర్వీసులు నడుపుతోంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *